Chandrayaan-2: ఇస్రో చైర్మన్ కంటతడి పెట్టడాన్ని ఎద్దేవా చేసిన రాజకీయ విశ్లేషకుడు... దీటైన జవాబిచ్చిన కోన వెంకట్
- చివరి దశలో నిరాశపర్చిన చంద్రయాన్-2
- కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో చైర్మన్ కు ప్రధాని మోదీ ఓదార్పు
- అసందర్భ వ్యాఖ్యలు చేసిన ఓ రాజకీయ విశ్లేషకుడు
- ఒకరి కన్నీళ్లపై సరదా వ్యాఖ్యలు చేయడం మరింత మూర్ఖత్వం అంటూ బదులిచ్చిన కోన
చారిత్రాత్మకం అనదగ్గ చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలం కావడం పట్ల ఇస్రో చైర్మన్ శివన్ కన్నీటి పర్యంతం కావడం, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను హృదయానికి హత్తుకుని ఓదార్చడం యావత్ భారతాన్ని ఆకర్షించింది. అయితే, దీనిపై గౌరవ్ పాంధీ (Gaurav Pandhi) అనే రాజకీయ విశ్లేషకుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇస్రో చైర్మన్ స్థాయి ఉన్న వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడం ఏంటి? ఇలాంటి చిన్న చిన్న ఘటనలకు కన్నీళ్లు పెట్టడం మూర్ఖత్వం అనిపిస్తోంది అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ దర్శక రచయిత కోన వెంకట్ దీటుగా స్పందించాడు. "మిస్టర్ పాంది గారూ, మీరు పొరబడ్డారు. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం ఒక్కసారిగా విఫలమైతే కన్నీళ్లే వస్తాయి. ఒకరి కన్నీళ్లపై సరదా వ్యాఖ్యలు చేయడం మరింత మూర్ఖత్వం అనిపిస్తోంది" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చాడు.