Mumbai: భారీ వరదలో లగ్జరీ జాగ్వార్ ను దాటి దూసుకుపోయిన మహీంద్రా బొలెరో... వీడియో వైరల్.. ఆనంద్ మహీంద్రా స్పందన

  • ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా బొలెరోను తయారు చేశాం
  • బొలెరో అంటే నాకు ఎందుకంత ఇష్టమో ఇప్పడు అందరికీ అర్థమై ఉంటుంది
  • బొలెరో ఓ బాస్ లా దూసుకుపోయింది

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పక్కన ఉన్న సముద్రం నగరంలోకి చొచ్చుకు వచ్చిందా? అన్నట్టుగా ముంబై జలమయమైంది. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. దీని కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవీ ముంబైలోని ఐరోలీ ప్రాంతంలో ఈ వీడియా తీశారు.

రోడ్డుపై భారీగా వరద నిలిచిపోవడంతో లగ్జరీ కారైన జాగ్వార్ ముందుకు వెళ్లలేక నీటిలో నిలిచిపోయింది. దాని పక్కనుంచే మహీంద్రా బొలెరో వాహనం నీటిని చిమ్ముకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ ఫన్నీ వీడియో పై నెటిజెన్లు కామెంట్లు పెడుతూ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా దీనిపై కూడా తనదైన శైలిలో స్పందించారు.

'ఈ విషయాన్ని మేము గొప్పగా చెప్పుకోము. ఇది న్యాయమైన పోటీ కాదు. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా బొలెరోను మేము తయారు చేశాం. నాకు బొలెరో అంటే ఎందుకంత ఇష్టమో ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది. ముంబై వరదల్లో జాగ్వార్ చిక్కుకు పోయింది. బొలెరో మాత్రం ఒక బాస్ మాదిరి దూసుకుపోయింది' అంటూ ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రా స్పందించారు.

Mumbai
Bolero
Jaguar
Floods
Anand Mahindra
  • Error fetching data: Network response was not ok

More Telugu News