Andhra Pradesh: ఎన్టీఆర్ కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు: ఏపీ మంత్రి నారాయణస్వామి
- గుంటూరులో సమీక్షా సమావేశం
- మద్యపాన నిషేధం ఒకేసారి సాధ్యంకాదని, దశలవారీగా అమలు చేస్తున్నామన్న నారాయణస్వామి
- తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడడం లేదంటూ వెల్లడి
ఏపీ అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి మద్యపాన నిషేధంపై మరోసారి స్పందించారు. మద్యపాన నిషేధం ఒకేసారి సాధ్యంకాదని, అందుకే దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేశారని, తమ ప్రభుత్వం కూడా మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడడంలేదని స్పష్టం చేశారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం మద్యం బెల్టు షాపుల నివారణకు శ్రమిస్తున్నామని, మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మద్యపానంతో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. నాటుసారా కాసే కూలీలపై కాకుండా యజమానులపై కేసులు పెడతామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. అక్టోబరు నుంచి రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే ఉంటాయని వెల్లడించారు.