Srikakulam District: ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ముఖ్యమంత్రి జగన్‌ వరాల జల్లు

  • పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
  • స్టేజ్‌-3 నుంచే కిడ్నీ బాధితులకు రూ.5 వేల పెన్షన్
  • రోగులకు, వారి సహాయకులకు ఉచిత బస్సుపాస్

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దానం ప్రాంత ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకున్న సీఎం అక్కడ 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, ఉద్దానం ప్రాంత ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు రూ.600 కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి కూడా జగన్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్న రోగుల్లో స్టేజ్‌-3 బాధితుల నుంచే ఐదు వేల రూపాయల పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘ఇప్పటి వరకు స్టేజ్‌-5 నుంచి బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే మీ ఎమ్మెల్యే (పలాస శాసన సభ్యుడు) స్టేజ్‌-3 నుంచే బాధితులు భారీ మొత్తంలో మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉన్నందున, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నా దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు స్టేజ్‌-3 నుంచి కూడా బాధితులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు  ప్రకటిస్తున్నా’ అంటూ సభాముఖంగా తెలిపారు.

అదే విధంగా  రోగులకు, వారి సహాయకులకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రోగులకు ల్యాబ్ లో పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారని తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తిచేసి రైతులకు ప్రయోజనం సత్వరం అందేలా చూస్తామని తెలిపారు.

Srikakulam District
palasa
uddanam
kidney pationts
super speciality hospital
  • Loading...

More Telugu News