West Godavari District: రెండు రోజులు టెన్షన్ పెట్టిన ముగ్గురు అమ్మాయిలు... హైదరాబాద్ లో ప్రత్యక్షం!
- పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలో ఘటన
- సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకున్న అమ్మాయిలు
- స్థానిక వ్యక్తి కంటబడటంతో ఉత్కంఠకు తెర
పశ్చిమ గోదావరి జిల్లాలో అదృశ్యమైన ముగ్గురు బాలికలు హైదరాబాద్ లో ప్రత్యక్షం కావడంతో, అప్పటివరకూ ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, బాలికల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాఘవాపురం గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక, నాలుగు, ఆరో తరగతులు చదువుతున్న మరో ఇద్దరితో కలిసి, పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి రాలేదు. స్కూల్ లో విచారించగా, వారు రాలేదన్న సమాధానం రావడంతో, కంగారుపడి, అక్కడా, ఇక్కడా వెతికి, చివరకు పోలీసులను ఆశ్రయించారు.
కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, వీరు ఓ ఆటోను ఎక్కారని గుర్తించారు. ఆటో డ్రైవర్ ను విచారించగా, వీరిని సత్తుపల్లి సమీపంలోని గంగారం వద్ద దించినట్టు అతను చెప్పాడు. దీంతో పోలీసుల టీమ్ అక్కడికి వెళ్లి, సినిమా హాల్స్, వ్యాపార సముదాయాల్లో గాలించగా, ఓ బంగారం దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో వీరు వెళుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. అప్పటికే అక్కడి నుంచి హైదరాబాద్ బస్సెక్కిన ముగ్గురూ రాత్రి 12 గంటలకు బస్టాండ్ లో దిగారు. బాలికల అదృశ్యంపై మీడియాలో వార్తలను చూసిన చింతలపూడి నివాసి నాగేంద్ర ప్రసాద్, ఆ సమయంలో బస్టాండ్ లోనే ఉన్నాడు. వీరిని చూసి గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వీరిని తీసుకుని బస్సులో వస్తున్నానని చెప్పాడు. దీంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది.