Tamilnadu: ఐదు గంటల్లో 366 కిలోమీటర్లు.. బాలుడిని కాపాడిన అంబులెన్స్ డ్రైవర్!
- తమిళనాడులోని రామనాథపురానికి చెందిన బాలుడు
- విషమించిన బాలుడి ఆరోగ్యం
- తోటి డ్రైవర్ల సాయంతో బాలుడిని కాపాడిన ఇజాస్
ఓ ప్రాణాన్ని కాపాడేందుకు వందల చేతులు ఏకమయ్యాయి. కొందరు అంబులెన్సు డ్రైవర్ల చొరవతో ఓ నిండు ప్రాణం నిలిచింది. ఓ బాలుడిని కాపాడేందుకు 366 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ ద్వారా 5 గంటల్లోనే చేరుకున్నారు. దీంతో బాలుడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని రామనాథపురం సమీపంలోని అళగన్ కుళం గ్రామానికి చెందిన ఎన్.మొహమ్మద్ కుమారుడు అమీరుల్(13) వెన్నెముక కేన్సర్ తో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్యం ఇటీవల ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరిలోని జిప్ మర్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కేవలం 8 గంటల్లోగా బాలుడిని తరలిస్తేనే ప్రాణాలు దక్కుతాయని స్థానిక వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇజాస్ తోటి అంబులెన్స్ డ్రైవర్ల సాయం కోరాడు. దీంతో వారంతా అంబులెన్స్ వెళ్లే మార్గంలో ప్రజలకు విషయం తెలియజేశారు. స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. దీంతో 8 గంటలు పట్టే 366 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం కేవలం 5 గంటల్లోనే ముగిసింది. అంబులెన్స్ సురక్షితంగా జిప్ మర్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇజాస్ తో పాటు అంబులెన్స్ డ్రైవర్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.