KCR: నేను చీఫ్ మినిస్టర్ గా కాదు.. చీఫ్ సర్వెంట్ గా పని చేస్తున్నా: కేసీఆర్
- ముఖ్య సేవకుడిని అనే భావనతో పని చేస్తున్నా
- అధికారులు కూడా ఇదే భావనతో పని చేయాలి
- గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలి
తెలంగాణకు తాను చీఫ్ మినిస్టర్ కాదని... చీఫ్ సర్వెంట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రానికి ముఖ్య సేవకుడిని అనే భావనతోనే తాను పని చేస్తున్నానని చెప్పారు. అధికారులు కూడా ఇదే భావనతో పని చేయాలని సూచించారు. తాము ప్రజా సేవకులం అనుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునేంత ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు రూపుదిద్దుకోవాలని అన్నారు. 30 రోజుల ప్రణాళికతో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలని చెప్పారు. 30 రోజుల తర్వాత గ్రామాల ముఖచిత్రాలు మారాలని... రానున్న దసరాను పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
గ్రామ పంచాయతీలు ప్రజల భాగస్వామ్యంతో పని చేయాలని కేసీఆర్ చెప్పారు. గ్రామాలలో అక్రమ కట్టడాలను వన్ టైమ్ రెగ్యులరైజేషన్ పద్ధతిలో క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. పంచాయతీల్లోని స్టాండింగ్ కమిటీల్లో 50 శాతం అవకాశాలను మహిళలకు ఇవ్వాలని చెప్పారు. దోమలను నివారించేందుకు ప్రతి ఇంటికి 6 కృష్ణ తులసి మొక్కలను ఇవ్వాలని సూచించారు. ఎంపీడీవోల వాహన అలవెన్సులను రూ. 24 వేల నుంచి రూ. 33 వేలకు పెంచుతామని చెప్పారు.