Fruad: 'చాలా అందంగా ఉన్నావు.. పెళ్లి చేసుకుంటా ' అంటూ... డబ్బులు నొక్కేసిన కేటుగాడు!
- మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో అమ్మాయి వివరాలు
- డాక్టర్ నని పరిచయం చేసుకున్న మోసగాడు
- రూ. 75 వేలు నొక్కేసి ఫోన్ స్విచ్చాఫ్
తనకు తగిన వరుడు దొరకుతాడన్న ఆశతో, వివరాలన్నీ ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పెట్టి, దారుణంగా మోసపోయిందో యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చాగలమర్రికి చెందిన హజీమాబూబ్‌బీ బీకామ్ వరకూ చదువుకుని, లేడీస్ హాస్టల్ లో ఉంటూ, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
తనకు వరుడు కావాలంటూ, షాదీ డాట్ కామ్ లో ఫొటోలు, సెల్ ఫోన్ నంబర్ అప్ లోడ్ చేసింది. ఆపై తాను కాలిఫోర్నియాలో డాక్టర్ గా పనిచేస్తున్నట్టు చెప్పుకున్న అజీమ్ వసీర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావని పొగిడాడు. నీ అందానికి ఫిదా అయిపోయానని మెసేజ్ లు పెట్టాడు. ఒక్కసారి ఢిల్లీకి వస్తే, చూసి వెళ్తానని చెప్పడంతో, ఆమె ఢిల్లీకి వెళ్లి ఎయిర్ పోర్టులో గంటల కొద్దీ వేచి చూసింది.
ఆ సమయంలో అతని ఫోన్ పని చేయలేదు. చివరకు నిరాశతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత మళ్లీ ఫోన్ చేసిన అతను, తాను 6 లక్షల డాలర్ల విలువైన బహుమతి తీసుకుని వస్తుంటే, కస్టమ్స్ పోలీసులు పట్టుకున్నారని నమ్మబలికాడు. తాను రూ. 75 వేలు చెల్లిస్తేనే వదులుతారని, ఆ డబ్బులు పంపాలని కోరాడు. దాన్ని నమ్మిన బాధితురాలు ఆ మొత్తాన్ని అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్ లో జమ చేసింది. ఆపై అతని ఫోన్ కూడా పనిచేయక పోవడంతో, మోసపోయానంటూ, పోలీసులను ఆశ్రయించింది.