Andhra Pradesh: సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ.. ఆదేశించిన జగన్ ప్రభుత్వం!
- 2016లో 22 కోట్లకు సదావర్తి భూముల వేలం
- అడ్డుపడ్డ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
- రెండోసారి వేలం నిర్వహించిన ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను సమీక్షిస్తున్న జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ వేలం ప్రక్రియలో తొలుత అక్రమాలు చోటుచేసుకున్నట్లు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం, సదావర్తి భూముల వేలం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. వాసిరెడ్డి వంశానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అమరావతి పుణ్యక్షేత్రాన్ని దర్శించేవారి కోసం 1885లో ఈ సత్రాన్ని నిర్మించారు.
2016 మార్చి 28న టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించగా, రూ.22.44 కోట్ల ధర పలికింది. అయితే ఇంత తక్కువ ధరకు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అదనంగా మరో రూ.5 కోట్లు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై ఇతర వేలంపాట దారులు అభ్యంతరం చెప్పారు.
దీంతో మళ్లీ వేలంపాట నిర్వహించగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ తరపున శ్రీనివాసరెడ్డి, పద్మనాభయ్య రూ.60.30 కోట్లకు ఈ భూమిని దక్కించుకున్నారు. తాజాగా ఈ భూమిని తక్కువ ధరకే అంటే రూ.22.44 కోట్లకే వేలంలో అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.