bihar: బీహార్ లో బిస్కెట్ల అమ్మకాలు తగ్గలేదు.. ఆటోమొబైల్ రంగం క్షీణించలేదు: సుశీల్ మోదీ
- ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ
- ఆర్థిక సంక్షోభం వార్తల్లో నిజం లేదు
- గతేడాదితో పోలిస్తే విక్రయాలు పెరిగాయన్న డిప్యూటీ సీఎం
దేశం ఆర్థిక మందగమనంలోకి జారుకుంటోందన్న వార్తలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. బీహార్‌లో ఆటో మొబైల్ విక్రయాలు, బిస్కెట్ల అమ్మకాలు బాగానే ఉన్నాయని అన్నారు. ఆ వార్తలే నిజమైతే రాష్ట్రంలో వాహనాల విక్రయాలు తగ్గాలని, కానీ గతేడాదితో పోలిస్తే మరింత పెరిగాయని పేర్కొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుశీల్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైందన్న వార్తలు దినపత్రికల్లో వస్తున్నాయని, జనం బిస్కెట్లు కూడా కొనడం లేదని, బ్రాండెడ్ కంపెనీల బిస్కెట్ సేల్స్ పడిపోయిందని వార్తలు వస్తున్నాయన్నారు. దీంతో తాను బీహార్‌లోని బిస్కెట్ కంపెనీలతో మాట్లాడానని, వారు అటువంటిదేమీ లేదని చెప్పారని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏడేళ్ల కనిష్టానికి పడిపోయి 5 శాతంగా నమోదైంది.