YSR: వైఎస్సార్ చేసిన మేలును ప్రజలు గుర్తుపెట్టుకున్నారు... అందుకే జగన్ ను అక్కున చేర్చుకున్నారు: వైఎస్ విజయమ్మ

  • నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి
  • ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన విజయమ్మ
  • వైఎస్సార్ ఆశయాలను జగన్ నిలబెడతాడని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్న విజయమ్మ

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన అర్ధాంగి వైఎస్ విజయమ్మ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  వైఎస్సార్ లేక పదేళ్లవుతున్నా ఆ బాధ ఎవరిలోనూ తగ్గలేదని తెలిపారు. ఆయన మరణించిన సెప్టెంబరు 2 వస్తుందంటే చాలు ఎంతో బాధేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు వైఎస్సార్ చేసిన మేలు గుర్తుపెట్టుకున్న ప్రజలు నేడు జగన్ ను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను నిలబెడతాడని జగన్ పై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా తీసివేయలేనిదని విజయమ్మ చెప్పుకొచ్చారు.

తన తండ్రి కంటే ప్రజలకు ఎక్కువ మేలు చేయాలన్నది జగన్ తపన అని తెలిపారు. ఎన్నికల వేళ ప్రకటించిన మేనిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేయాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. జగన్ ను కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు, చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినా కానీ జగన్ మాట మీద నిలబడడాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. మంచి మనసుతో మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ప్రకృతితో పాటు దేవుడు కూడా సహకరిస్తాడని ఈ సందర్భంగా విజయమ్మ వ్యాఖ్యానించారు. జగన్ ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.

YSR
YSRCP
YS Vijayamma
Jagan
  • Loading...

More Telugu News