ISRO: గగన్ యాన్ ప్రాజెక్టు.. భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్న రష్యా!
- 2021 నాటికి చేపట్టనున్న భారత్
- నలుగురు వ్యోమగాములకు రష్యాలో శిక్షణ
- మాస్కోలో ఇస్రో స్పెషల్ యూనిట్ ఏర్పాటు
భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకల నాటికి సొంతంగా భారతీయులను అంతరిక్షంలోకి పంపుతామని గతేడాది ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో గగన్ యాన్ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. తాజాగా ఈ ప్రాజెక్టులో పాల్గొనే నలుగురు వ్యోమగాములకు (ఆస్ట్రోనాట్స్) రష్యాలో త్వరలోనే శిక్షణ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అంతరిక్షంలో కీలకమైన 4-5 విభాగాల్లో భారత వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇస్తుందని వెల్లడించాయి. దీనివల్ల ప్రాజెక్టు ప్రారంభించేందుకు అవసరమయ్యే సమయం తగ్గుతుందని పేర్కొన్నాయి.
2021, డిసెంబర్ లోపు జీఎస్ఎల్వీ మార్క్-3 నౌక ద్వారా ఈ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామనీ, వీరంతా అక్కడే ఓ మాడ్యుల్ లో 5 నుంచి 7 రోజులు గడుపుతారని సమాచారం. అనంతరం ఈ మాడ్యుల్ బంగాళాఖాతంలో సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. రష్యాలో 15 నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్నాక భారత్ లో మరో 6-8 నెలలు అడ్వాన్స్ డ్ శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గగన్ యాన్ ప్రాజెక్టు కోసం మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇస్రో ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతరిక్షంలో విహరించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మను సైతం రష్యానే అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.