Uttar Pradesh: తాను చనిపోయానని లీవ్ లెటర్ పెడితే... ఓకే చేసిన ప్రిన్సిపాల్!
- యూపీ, కాన్పూర్ లోని స్కూల్ లో ఘటన
- చనిపోయినట్టు లెటర్ రాసిన 8వ తరగతి విద్యార్థి
- చదవకుండానే లీవ్ మంజూరు చేసిన ప్రిన్సిపాల్
సెలవు కావాలని భావించిన ఓ విద్యార్థి, తాను చనిపోయానంటూ లీవ్ లెటర్ రాయగా, దాన్ని కనీసం చదవకుండానే, సెలవును మంజూరు చేస్తూ సంతకం పెట్టిన ప్రిన్సిపాల్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, యూపీలోని కాన్పూర్‌లోని ఒక పాఠశాలలో, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తాను చనిపోయానని చెబుతూ, సెలవు కావాలని ప్రిన్సిపాల్ కు లెటర్ పంపాడు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ప్రిన్సిపాల్ ఆ సెలవు చీటీపై సంతకం చేయడం. ఈ లేఖలో "సార్... ఆగస్టు 20న 10 గంటలకు నేను (విద్యార్థి పేరు) మరణించాను. అందువల్ల నాకు దయచేసి హాఫ్ డే లీవ్ ఇవ్వండి" అని ఉంది. దీనిని చూడకుండానే దానిని ఎర్ర ఇంక్ పెన్ తో గ్రాంటెడ్ అని రాసేశారు. దీన్ని తీసుకున్న విద్యార్థి, ఇంటికి వెళ్లిపోగా, కొన్ని రోజుల తరువాత ఈ లేఖ అతని స్నేహితుల కంటబడింది. ఆపై సోషల్ మీడియాలోకి ఎక్కి, చర్చనీయాంశంగా మారింది.