Chandrababu: వైసీపీ వేధింపులపై సెప్టెంబరు 3 నుంచి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణ: చంద్రబాబు

  • టీడీపీ కార్యకర్తలను గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారంటూ ఆగ్రహం
  • వైసీపీ బాధితులకు గుంటూరులో ఆశ్రయం కల్పిస్తామంటూ భరోసా
  • గ్రామాల్లో పరిస్థితులు చక్కబడేంత వరకు వారికి అండగా నిలుస్తామన్న టీడీపీ అధినేత

స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ నివసించే హక్కు ఉంటుందని, ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేస్తున్నారని, పంట పొలాలు సాగుచేసుకోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, ఏమిటీ దౌర్జన్యం అంటూ మండిపడ్డారు.

అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించబోమని, వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబరు 3 నుంచి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా, సెప్టెంబరు 3 నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు.

పల్నాడు, ఇతర ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల దాడుల కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ గుంటూరులో ఏర్పాటు చేసే శిబిరంలో ఆశ్రయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత తానే దగ్గరుండి వారిని గ్రామాలకు తీసుకెళతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News