PVP: దర్శకుల తీరుపై 'పీవీపీ' వరప్రసాద్ అసంతృప్తి!
- నిర్మాతలను సెట్స్ మీదకు రావొద్దని ఇద్దరు దర్శకులు షరతులు పెడతారంటూ వ్యాఖ్యలు
- వాళ్లిద్దరూ మన పొరుగు రాష్ట్రాల వారేనంటూ వెల్లడి
- మహేశ్ బాబు దర్శకుల హీరో అంటూ కితాబు
ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త 'పీవీపీ' వరప్రసాద్ కొందరు దర్శకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతలను సెట్స్ మీదకు రావొద్దంటూ ఇద్దరు డైరెక్టర్లు షరతులు విధిస్తుంటారని అన్నారు. వాళ్లిద్దరూ సౌతిండియాలో స్టార్ డైరెక్టర్లని, మన పక్క రాష్ట్రాలకు చెందినవారేనని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. దర్శకులకు బాగా డిమాండ్ ఉండడంతో వారిని విమర్శించలేమని, నిర్మాతలకు వారే దిక్కని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన 'బ్రహ్మోత్సవం' సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కు హీరో మహేశ్ బాబు ఎంతమాత్రం కారణం కాదని, ఓ సినిమా ఎప్పుడూ దర్శకులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. మహేశ్ బాబు దర్శకులు ఎలా చెబితే అలా నడుచుకుంటాడని, ఓ సీన్ ను 10 సార్లు చెయ్యమన్నా చేస్తాడని వివరించారు. కానీ, నిర్మాతలు ఓ సినిమా కోసం కోట్లు కుమ్మరిస్తుంటే కొందరు డైరెక్టర్లు మాత్రం స్క్రిప్టు కూడా పూర్తికాకుండానే షూటింగ్ మొదలుపెడుతుంటారని 'పీవీపీ' ఆవేదన వ్యక్తం చేశారు.