Telugudesam: ఇప్పటి వరకు తిన్నది చాలు.. ఇకనైనా పేదలను బతకనివ్వండి: వైసీపీపై నారా లోకేశ్ విమర్శలు
- వైసీపీ ఇసుకాసురుల కోసం కృత్రిమ కొరత సృష్టించారు
- నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు
- ఏపీలో ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవాలి
ఏపీలో ఇసుక కొరతపై మండిపడుతున్న టీడీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వైసీపీ ఇసుకాసురులను మేపడం కోసం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని అన్నారు. పేదలను పీడించుకు తింటున్న ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
టీడీపీ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం తమ నాయకులను అరెస్టు చేయించిందని, గృహ నిర్బంధాలు చేసిందని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా తమను అపహాస్యంపాలు చేసేందుకు దుష్ప్రచారం చేసిందని, అయినా పేదలకు అండగా నిలుస్తూ చేసిన ఉద్యమం విజయవంతమైందని అన్నారు.
ఏపీలో తుగ్లక్ పాలన ఫలితంగా మూడు నెలల నుంచి పనుల్లేక భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడం లేదని అన్నారు. అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలకు వెంటనే ఇసుకను అందుబాటులోకి తేవాలని, ‘ఇప్పటి వరకు తిన్నది చాలు.. ఇకనైనా పేదలను బతకనివ్వండి’ అని వైసీపీ నేతలకు హితవు పలికారు.