Chandrababu: వైసీపీ నేతలు ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులు అనిపించుకున్నారు: చంద్రబాబు
- వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు
- వైసీపీ నేతల ధనదాహం ఫలితంగా 20 లక్షల మంది రోడ్డున పడ్డారంటూ వ్యాఖ్యలు
- రోడ్డున పడ్డ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.60 వేలు ఇవ్వాలంటూ డిమాండ్
టీడీపీ హయాంలో ఇసుక యూనిట్ ధర రూ.1200గా ఉంటే, వైసీపీ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని యూనిట్ ధర రూ.10 వేలకు చేరిందని, ఇంతటి ఘనతను సాధించిన వైసీపీ నేతలు తాము ఇసుక నుంచి కూడా తైలాన్ని తీయగల సమర్థులని నిరూపించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ నేతల ధనదాహం ఫలితంగా 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, రోడ్డున పడిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థికసాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.