Ashok kumar: నా తండ్రికి భారతరత్న ఇవ్వమని అడుక్కోలేను: ధ్యాన్‌చంద్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు
- అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓసారి అవమానించింది
- ధ్యాన్‌చంద్ దేశం గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు
- హిట్లర్ ఎదుటే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనత మా నాన్నది
భారత హాకీ దిగ్గజం , ఒలింపిక్‌లో మూడుసార్లు భారత్‌ను జగజ్జేతగా నిలిపిన మేజర్ ధ్యాన్‌చంద్ కుమారుడు, హాకీ ఇండియా మాజీ కెప్టెన్ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నకు నామినీలను ఎంపిక చేసేటప్పుడు తన తండ్రిని విస్మరిస్తున్నారన్న ఆయన.. తన తండ్రికి భారతరత్న ఇవ్వాలని తాను అడుక్కోబోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రికి భారతరత్న ఇచ్చే ఫైల్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో సంతకం చేశారని, ఇదే విషయాన్ని అప్పటి కేంద్రమంత్రి కూడా తమకు చెప్పారని ఒలింపిక్ పతక విజేత అయిన అశోక్ కుమార్ తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని, దాదా (ధ్యాన్‌చంద్)కు భారతరత్న ఇవ్వలేదని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం తమను మాత్రమే కాదని, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన వ్యక్తిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధ్యాన్‌చంద్ లాంటి వ్యక్తిని దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. బ్రిటిష్ పాలనలో కూడా తన తండ్రి ధైర్య సాహసాలు ప్రదర్శించారని గుర్తు చేశారు. 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌కు తన తండ్రి సూట్‌కేసులో త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఫైనల్లో జర్మనీని ఓడించిన తర్వాత హిట్లర్ ఎదుటే తన తండ్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని అశోక్ కుమార్ గుర్తు చేశారు.