Jamuna: స్టూడియో కట్టుకోవడానికి స్థలం తీసుకుని వుంటే ఇప్పుడది ఎన్నో కోట్లు అయ్యేది: సీనియర్ హీరోయిన్ జమున
- ముందుగా హైదరాబాద్ వచ్చింది ఎన్టీఆర్ గారే
- ఆ తరువాత ఏఎన్నార్ ఆసక్తిని చూపించారు
- నాకు స్థలం ఇస్తానంటే వద్దని చెప్పానన్న జమున
తెలుగు తెర చందమామగా పేరు తెచ్చుకున్న జమున, చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తరలిరావడం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "తెలుగు చిత్రపరిశ్రమ చెన్నైలో కొనసాగుతుండగా, అక్కడి నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చింది ఎన్టీ రామారావుగారే. రామకృష్ణ సినీ స్టూడియోస్ ఇక్కడ నిర్మించారు. ఆ తరువాత అక్కినేనిగారు ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపించారు.
ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే అక్కినేని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కట్టారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, 'స్టూడియో కట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున స్థలాలు కేటాయిస్తున్నాము .. మీరు తీసుకోండి' అని నాతో అన్నారు. 'స్టూడియో నిర్మాణ వ్యవహారాలు చూడటానికి నాకు ఎవరూ లేరండీ .. నాకు బంజారా హిల్స్ లో స్థలం వుంది .. అక్కడ ఇల్లు కట్టుకుంటాను' అని చెప్పి ఆయన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాను. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన స్ధలాన్ని తీసుకుని వుంటే, అది ఈ రోజున ఎన్ని కోట్లు అయ్యుండేదో" అని చెప్పుకొచ్చారు.