Jalaj Saxena: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6 వేల పరుగులు, 300 వికెట్లు సాధించిన జలజ్
- దులీప్ ట్రోఫీలో 7 వికెట్లు తీసి రికార్డులకెక్కిన సక్సేనా
- కపిల్ దేవ్, లాలా అమర్‌నాథ్, పాలీ ఉమ్రిగర్ సరసన ఎలైట్ జాబితాలో చోటు
కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఇండియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6000 పరుగులు చేసి 300 వికెట్లు పడగొట్టిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. 32 ఏళ్ల జలజ్ దులీప్ ట్రోఫీలో ఈ ఘనత అందుకున్నాడు. కేరళ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న జలజ్ ఈ ఘనతతో దిగ్గజ ఆల్ రౌండర్లు కపిల్ దేవ్, లాలా అమర్‌నాథ్, పాలీ ఉమ్రిగర్ వంటి వారి సరసన ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా బ్లూకు ప్రాతినిధ్యం వహిస్తున్న జలజ్ ఇండియా రెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి తన పేరున అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఈ ఏడు వికెట్లతో అతడి ఖాతాలో చేరిన మొత్తం వికెట్ల సంఖ్య 300కు చేరుకుంది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో మూడు ఫ్రాంచైజీలకు ఆడిన సక్సేనా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్ జట్టులో ఉన్నాడు. సక్సేనా ఈ రికార్డు సాధించగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతడిని అభినందిస్తూ ట్వీట్ చేసింది.