India: ఒక్కరోజులో రూ. 2,110 పెరిగిన కిలో వెండి ధర!
- రూ. 48,850కి కిలో వెండి ధర
- రూ. 40 వేలకు చేరువలో బంగారం
- బులియన్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
నిన్నమొన్నటి వరకూ బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించగా, ఇప్పుడా అవకాశం వెండికి వచ్చింది. నిన్న ఒక్కరోజులోనే వెండి ధర కిలోకు రూ. 2,110కి పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ. 48,850కి చేరుకుంది. ఇటీవలి కాలంలో పది గ్రాముల బంగారం ధర రూ. 40 వేలను దాటి, ఆపై స్వల్పంగా కిందకు దిగివచ్చిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలతో గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతూ ఉన్నాయని బులియన్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. చమురు మార్కెట్ లో పెట్టుబడుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండటం, స్టాక్ మార్కెట్లు అనిశ్చితిలో సాగుతూ ఉండటంతో, ఇన్వెస్టర్లు బులియన్ వైపు దృష్టిని సారిస్తున్నారని, అందువల్లే ధరలు పెరుగుతూ ఉన్నాయని అంచనా వేశారు.
ఇదిలావుండగా, ఇండియాలో కొనసాగుతున్న పండగ సీజన్ కూడా బంగారం ధరలను పెంచేలా చేస్తోంది. శ్రావణమాసం, ఆపై వివాహాది శుభముహూర్తాలు, దసరా, దీపావళి వంటి పండగలు వరుసగా రావడంతో, విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్న ఆభరణాల తయారీదారులు పెద్దఎత్తున బంగారం, వెండి కొని నిల్వ చేస్తున్నారు. ఈ కారణంతో కూడా ధరలు పెరుగుతున్నాయి.