Tirumala: తిరుమలలో లడ్డూ ధరను మించిపోయిన కవర్ ధర!
- ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనార సంచులు
- నాలుగు రకాల్లో విడుదల
- రూ. 25 నుంచి రూ. 55 వరకూ ధర
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య ప్రసాదమైన లడ్డూ ధర రూ. 25 ల నుంచి రూ. 50 వరకు వుంటుంది. అధికంగా కావాలని భావించిన వారికి రూ. 50పై ఒక్కో లడ్డూను అధికారులు అందిస్తుంటారు. సాధారణ భక్తులకు ప్రతి ఒక్కరికీ కనీసం రెండు లడ్డూలను అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది. ఇక తిరుమలలో ప్లాస్టిక్ నిషేధంపై కీలక అడుగులు వేసిన అధికారులు, లడ్డూ ప్రసాదాలను తీసుకువెళ్లే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జూట్ బ్యాగ్ లను అందుబాటులోకి తెచ్చారు.
ఈ బ్యాగు కనీస ధర రూ. 25. అంటే, సాధారణ భక్తుడి దృష్టిలో ఇది లడ్డూ ధరకన్నా అధికం. ఇందులో కేవలం ఐదారు లడ్డూలు మాత్రమే వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మరో రకం జ్యూట్ బ్యాగ్ ధర రూ. 30. ఇందులో 8 నుంచి 10 లడ్డూలు వేసుకోవచ్చు. ఇదే తరహాలో రూ. 35పై ఓ బ్యాగ్ (4 కిలోల బరువు మోసేలా), రూ. 55పై మరో బ్యాగ్ (10 కిలోల బరువును మోసేలా) మరో రెండు రకాల బ్యాగ్ లనూ టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.
కాగా, ఇప్పటివరకూ టీటీడీ స్వయంగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి తక్కువ హాని కలిగించే యాభై మైక్రాన్ల పైబడిన బయో డీగ్రేడబుల్ కవర్లను టీటీడీ విక్రయించింది. చిత్తూరు జిల్లాలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు అమల్లోకి రావడంతోనే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక భక్తులకు అవసరమైన కవర్ల తయారీ బాధ్యతను సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్వీకరించింది. లాభనష్టాలు చూడకుండా తయారీ ధరకే జనపనార సంచులను విక్రయించడానికి అంగీకరించిందని టీటీడీ పేర్కొంది. తిరుమలలో ఈ జనపనార సంచుల విక్రయాలు ప్రారంభమయ్యాయి.