vijayashanti: సీబీఐ విచారణకు సిద్ధం కండి: టీఆర్ఎస్ నేతలకు విజయశాంతి హెచ్చరిక
- కేటీఆర్‌కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది
- బీజేపీ నేతల హెచ్చరికలతో ఆయనకు దిక్కు తోచడం లేదు
- వారి తప్పులకు శిక్ష పడే వరకు పోరాడతాం
ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఇక పనిచేయవని, అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులకు సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి సూచించారు. ఒకప్పటితో పోలిస్తే టీఆర్ఎస్ హైకమాండ్‌లో మార్పు కనిపిస్తోందని, ఇప్పుడు వారికి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని అన్నారు. సీబీఐ విచారణ పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలతో కేటీఆర్‌కు దిక్కుతోచడం లేదని, అందుకనే ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అన్నారు.
టీఆర్ఎస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవడం బెటరని విజయశాంతి అన్నారు. లేదంటే కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య ఏదో రహస్య ఒప్పందం జరిగి ఉంటుందని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పులకు వారికి శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. బీజేపీ బెదిరిస్తే కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడం, వారు బలపడితే కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమంటూ ప్రకటనలు చేయడం టీఆర్ఎస్ వైఖరికి నిదర్శనమని విజయశాంతి అన్నారు. ఇక ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఇక పనిచేయబోవని, చేసిన తప్పులకు సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విజయశాంతి హెచ్చరించారు.