Andhra Pradesh: మద్య నియంత్రణ, నిషేధం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి: సీఎం జగన్ ఆదేశాలు
- రాష్ట్ర రెవెన్యూపై జగన్ సమీక్ష
- నాటుసారా తయారీ కాకుండా చూడాలి
- రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు
ఏపీలో మద్య నియంత్రణ, నిషేధం అమలుకు తగు చర్యలు చేపట్టాలని, ఎన్ ఫోర్స్ మెంట్, పోలీస్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూపై వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖ అధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్షించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులు జగన్ కు నివేదించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లింగ్ జరగకుండా, నాటుసారా తయారీ కాకుండా చూడాలని ఆదేశించారు. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్య ప్రణాళికలో ఉంచాలని, గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని, అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని, ఒక మార్గదర్శక ప్రణాళిక తీసుకురావాలని ఆదేశించారు.