Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరం: చంద్రబాబునాయుడు
- ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలతో బాబు భేటీ
- తెలంగాణను పట్టించుకోవడం లేదన్నది కరెక్టు కాదు
- తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తాం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ, తెలంగాణను పట్టించుకోవడం లేదనే విమర్శలు సరికాదని అన్నారు.
తెలంగాణలో టీడీపీ మరింత పుంజుకునేలా చేస్తామని, ఇక్కడి నాయకులు వెళ్లిపోయారు గానీ కార్యకర్తలు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని, కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా వాళ్లు బాగుండాలని టీడీపీ కోరుకుంటోందని అన్నారు. ఆరోజు కష్టపడి పని చేశామని, దూరదృష్టితో ఆలోచించామని, నాడు తాము తీసుకున్న నిర్ణయాలతో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.