Pakistan: పాకిస్థాన్ వి ఉత్తుత్తి బెదిరింపులే... ఒక్కడుగు ముందుకేసినా ఆ దేశం సర్వనాశనమైపోతుంది: జాతీయ భద్రతా సలహామండలి మాజీ సభ్యుడు

  • భారత్ తో యుద్ధం చేసే శక్తి పాక్ కు లేదు
  • యుద్ధం అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందని పాక్ ఆర్మీకి తెలుసు
  • పాకిస్థాన్ ను భారత్ సర్వనాశనం చేస్తుంది

పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలు ఉన్న దేశమేనని... భారత్-పాక్ ల మధ్య అణు యుద్ధమే వస్తే ఒకరు ఓడిపోవడం, మరొకరు గెలవడం అంటూ ఉండదని... ప్రపంచ దేశాలన్నింటిపైనా దీని ప్రభావం పడుతుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ వ్యాఖ్యలను భారత జాతీయ భద్రతా సలహా మండలి మాజీ సభ్యుడు, భారత అణు విధాన రూపకల్పన సభ్యుడు భరత్ కర్నాడ్ తేలికగా తీసుకున్నారు. పాకిస్థాన్ వి ఉత్తుత్తి బెదిరింపులేనని ఎద్దేవా చేశారు. భారత్ పై అణ్వస్త్రాన్ని పాక్ ప్రయోగించలేదని చెప్పారు.

పూర్తి స్థాయి యుద్ధం అంటే సాధారణ విషయం కాదని... అంతటి సామర్థ్యం పాక్ కు లేదని భరత్ కర్నాడ్ తెలిపారు. ఆ దేశం వద్ద ఆయుధాల్లేవు, డబ్బులు లేవు, ఇతర నిల్వలు కూడా లేవని చెప్పారు. మనపై పాక్ యుద్ధానికి దిగుతుందనే ఆలోచన కూడా అనవసరమని అన్నారు. యుద్ధం వస్తే భారత్ ఎంత దూరమైనా వెళ్తుందనే విషయం పాక్ కు తెలుసని... అది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే విషయం పాక్ ఆర్మీకి కూడా తెలుసని చెప్పారు. భారత్ ను సమూలంగా దెబ్బతీసే శక్తి కానీ, అన్ని అణ్వస్త్రాలు కానీ ఆ దేశానికి లేవని తెలిపారు.

యుద్ధమే వస్తే... పాకిస్థాన్ కు అత్యంత కీలకమైన ఇస్లామాబాద్, కరాచీ, సియాల్ కోట్, రావల్పిండిలను భారత్ తుడిచి పెట్టేస్తుందని... అప్పుడు పాక్ అనే దేశం అంతరించిపోతుందని భరత్ కర్నాడ్ చెప్పారు. అందుకే భారత్ తో యుద్ధం చేసేందుకు పాక్ సైన్యం సాహసించదని అన్నారు. పాక్ తో భారత్ కు ఎలాంటి ముప్పు లేదని... కశ్మీర్ విషయంలో ఆ దేశం చేస్తున్నది కేవలం న్యూసెన్స్ మాత్రమేనని చెప్పారు. సొంత దేశంలో పలుకుబడి పెంచుకోవడం కోసమే ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News