Kodela: కోడెల ఫర్నిచర్ కేసు వాయిదా... ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ అధికారులకు హైకోర్టు ఆదేశం
- కోడెలపై ఫర్నిచర్ వ్యవహారంలో కేసు నమోదు
- హైకోర్టును ఆశ్రయించిన కోడెల
- ఫర్నిచర్ తీసుకెళ్లాలంటూ గతంలోనే లేఖ రాశారంటూ కోడెల న్యాయవాది వెల్లడి
హైదరాబాద్ లో ఏపీ అసెంబ్లీ నుంచి ఫర్నిచర్ తీసుకువచ్చి తన అధీనంలో ఉంచుకున్నారన్న ఆరోపణలపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై కోడెల పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లమని అధికారులకు కోడెల గతంలోనే లేఖరాశారని కోడెల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లేఖ విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వస్తువులు పోయాయని కేసు పెట్టారని వెల్లడించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ, ఫర్నిచర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఏయే వస్తువులు కనిపించకుండా పోయాయో వాటిపై ప్రమాణపత్రం సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఆపై, ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.