Private Train: ఇండియాలో ప్రైవేటు రైళ్లు... గంట ఆలస్యమైనా పరిహారం!

  • తొలి రైలు ఢిల్లీ - లక్నో మధ్య
  • ఆపై ముంబై - అహ్మదాబాద్ మధ్య
  • టికెట్ కొనుగోలుతోనే రూ. 50 లక్షల బీమా
  • రెండుసార్లు మీల్స్ సర్వ్ చేసే ఏర్పాట్లు

ఇటీవలే రెండు తేజాస్ రైళ్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం, ఆ రైళ్లకు మరింత ఆదరణ పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రైవేటు రైళ్లలో ప్రయాణించేవారికి, ప్రయాణ సమయం కనీసం గంట ఆలస్యమైతే పరిహారం చెల్లించాలని భావిస్తోంది. ఢిల్లీ నుంచి లక్నో మధ్య అక్టోబర్ నుంచి తొలి ప్రైవేటు రైలు పరుగులు పెట్టనుండగా, కనీస ధర అదే రూట్లో తిరిగే శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో శతాబ్దిలో ప్రయాణికులకు లభించే సేవలతో పోలిస్తే, మరిన్ని సేవలు లభిస్తాయని, రెండో భోజనం, టీ, కాఫీ అందించే వెండింగ్ మెషీన్లు, రైల్ హోస్టెస్ సదుపాయం, ఇన్ఫోటెయిన్ మెంట్ వంటివి అందుబాటులో ఉంటాయని సమాచారం.

"ఈ రూట్లో ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాం. కానీ, రైలు లక్నో చేరే సమయానికి లంచ్ సమయం అవుతుంది. ప్రయాణికులు ఆకలితో ఉంటారు. అందువల్ల రెండోసారి వారికి ఏదైనా సర్వ్ చేయాలని నిర్ణయించాం" అని ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో పాటు సీనియర్ సిటిజన్లకు 40 శాతం రాయితీ ఉంటుందని, ఇదే తరహా ప్రైవేటు రైలును ముంబై - అహ్మదాబాద్ మధ్య కూడా ప్రవేశపెడతామని, ఈ రైలు నవంబర్ నుంచి తిరుగుతుందని తెలిపారు.

తేజాస్ రైల్లో టికెట్ కొనుగోలుతోనే రూ. 50 లక్షల ఉచిత బీమా సదుపాయం కలుగుతుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించేందుకు పలు బీమా కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇదే సమయంలో మామూలు రైల్వే కోచ్ లలో నాలుగు టాయిలెట్లు ఉండగా, తేజస్ బోగీల్లో రెండు మాత్రమే ఉంటాయని, అది కొంత ప్రతిబంధకమేనని అన్నారు. విమానాల్లో 190 మందికి మూడే టాయిలెట్లు ఉంటాయని, బోగీలోని 72 మంది ప్రయాణికులకు రెండు సరిపోతాయనే భావిస్తున్నామని ఆయన అన్నారు.

మొత్తం 12 కోచ్ లు ఉండే తేజాస్ రైల్లో 78 శాతం ఆక్యుపెన్సీ నమోదైనా, బ్రేక్ ఈవెన్ వస్తుందని, ఆపై వచ్చే ప్రతి రూపాయి లాభమేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని మరిన్ని రూట్లను ఎంపిక చేసి ఇదే తరహా ప్రైవేటు రైళ్లను నడిపించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News