AC: జస్ట్ రూ. 800కే ఏసీ... గుజరాత్ యువకుడి వినూత్న ఆవిష్కరణ!
- మట్టికుండల కాన్సెప్ట్ లో ఏసీ
- పింగాణీతో తయారు చేసిన మనోజ్ పటేల్
- ఒకసారి నీటిని నింపితే 12 రోజుల చల్లదనం
మట్టికుండల్లో నీరెందుకు చల్లగా వుంటుంది? కుండలోని అత్యంత సూక్ష్మమైన రంద్రాల ద్వారా నీరు ఆవిరి కావడంతోనే నీటిలో చల్లదనం పెరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీన్నే సూత్రంగా చేసుకుని గుజరాత్ కు చెందిన ఓ యువకుడు తన వినూత్న ఆలోచనతో ఓ ఏసీని తయారు చేశాడు. ఇందుకు అయిన ఖర్చు కేవలం రూ. 800 మాత్రమే. ఈ ఏసీ 32 డిగ్రీల గదిలోని వేడిమిని 23 డిగ్రీల వరకూ తగ్గించడమే దీని స్పెషాలిటీ. ఇంతకీ ఈ ఏసీ మిషన్ ను రూపొందించిన వ్యక్తి పేరు ఏంటో తెలుసా?... మనోజ్ పటేల్.
ఎంతో మంది మధ్య తరగతికి ఇంకా దగ్గరకాని ఎయిర్ కండిషనర్లను అందించాలన్న తపన మనోజ్ పటేల్ ను ఈ ఆవిష్కరణ దిశగా నడిపించింది. ఈ ఆలోచనతో మట్టికి బదులుగా పింగాణీని వాడి, మూడు మోడళ్లలో ఏసీ మెషీన్లను తయారు చేశాడు. ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికను ఏర్పాటు చేశాడు. ఇందులోనే ఓ మొక్క పెంచుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఆఫీసుల్లో, ఇళ్లల్లోనూ వాడుకోవచ్చు. పింగాణీ ఏసీలో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఒకసారి నీటి ట్యాంకును నింపితే 12 రోజుల వరకు ఆ నీటిని వాడుకుని చల్లదనాన్ని పొందవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టి తదితరాలను మాత్రమే ఇందులో వాడటం వల్ల ఖర్చు తక్కువైందని మనోజ్ చెబుతున్నాడు.