janasena: రైతులకు, వ్యవసాయ కూలీలకు నష్టపరిహారం చెల్లించాలి: ‘జనసేన’నేత భరత్ భూషణ్
- పవన్ కు వరద నష్టంపై నివేదిక అందజేత
- వరద ముంపు ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు మాఫీ చేయాలి
- రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి
వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలల పాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, పార్టీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ అప్పికట్ల భరత్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయాయని, ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ లోని ‘జనసేన’ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని ఈరోజు ఆయన కలిశారు. వరద నష్టంపై రూపొందించిన ఓ నివేదికను పవన్ కు అందజేశారు. రైతులు, కార్మికులు, మత్స్యకార్మికులు, చేతివృత్తులవారు, డ్వాక్రామహిళలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ఆయనకు వివరించారు.
అనంతరం, భరత్ భూషణ్ మాట్లాడుతూ, వరదల ముంపు బారినపడ్డ గ్రామాల్లో కొన్ని రోజులుగా అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్టు చెప్పారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ చేయాలని, రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో చేసిన క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పసుపు, కంద వంటి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని, తదుపరి పంట వేసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని, వ్యవసాయం సంబంధ రంగాలపై ఆధారపడి ఉన్న కూలీలకు ఆరు నెలల వరకు పనులు ఉండని పరిస్థితి కనుక, ఆ కాలంలో వారికి ప్రభుత్వం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వరద ముంపు ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు మాఫీ చేయాలని, పనులకు వెళ్లే డ్వాక్రా మహిళలకు ఆరు నెలల పాటు రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, వలలు కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వమే కొత్త వలలు సరఫరా చేయాలని, కొన్ని ప్రాంతాల్లో పడవలు కోల్పోయిన మత్స్యకారులకు వాటిని సమకూర్చాలని తదితర డిమాండ్లు చేశారు.