Andhra Pradesh: కోడెల టీడీపీ ప్రతిష్టను దెబ్బతీశారు.. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే!: వర్ల రామయ్య ఆగ్రహం
- అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై రగడ
- కోడెలతో టీడీపీకి నష్టం జరుగుతోంది
- బయటపడ్డాక ఫర్నీచర్ తీసుకెళ్లమనడం కరెక్ట్ కాదు
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెలపై సీనియర్ నేతలు తమ అసమ్మతి స్వరాన్ని పెంచుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేరారు. కోడెల శివప్రసాద్ చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని వర్ల రామయ్య తెలిపారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోవడం అన్నది ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేశారు. ఆయన తీరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నాకు తెలిసినంతవరకూ కోడెల చేసింది తప్పే. ఆయనకు ఫర్నీచర్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇంటికి ఫర్నీచర్ ను ఎలా తీసుకెళతారండీ? ఈ విషయం బయటకు వచ్చాక ‘ఇప్పుడు కావాలంటే తీసుకెళ్లండి’ అని కోడెల చెప్పడం కరెక్ట్ కాదు. కోడెల అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది. అసెంబ్లీ సిబ్బంది తీసుకెళ్లలేదు కాబట్టి సామగ్రిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పడం కూడా తప్పే.
ఆయన అసెంబ్లీ కార్యదర్శికి చెప్పే తీసుకెళ్లాడా ఫర్నీచర్ ను? లిస్ట్ ఇచ్చాడా? అంటే.. మా పార్టీ నాయకుడు అలా చేయకుండా ఉంటే బాగుండేది’ అని వర్ల రామయ్య తెలిపారు. కోడెల వ్యవహారశైలి కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తాను మాట్లాకపోతే ఇంకెవరూ మాట్లాడరని వర్ల రామయ్య అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్ కు ద్వేషం ఉందనీ, అందుకే పిచ్చి తుగ్లక్ లా రాజధానిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.