Traffic Police: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే పది రెట్ల జరిమానా... కట్టకుండా తప్పించుకుంటే..?
- తప్పించుకు తిరిగితే కఠిన చర్యలు
- జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది
- హెచ్చరిస్తున్న పోలీసు అధికారులు
ఇప్పటివరకూ రూ. 100, రూ. 500గా ఉన్న ట్రాఫిక్ జరిమానాలు ఇకపై రూ. 500 నుంచి రూ. 10 వేల వరకూ పెరిగాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలను పక్కాగా పాటించడమే లక్ష్యంగా మార్చిన నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక ఒకసారి జరిమానా పడిన తరువాత, దాన్ని కట్టకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటే...కఠిన చర్యలు తప్పవని, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. చలానాలు చెల్లించకుండా తప్పించుకోవచ్చని భావిస్తే అది పెద్ద తప్పు చేసినట్టని హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు, ఐదు కన్నా ఎక్కువ చలానాలు పెండింగ్ లో ఉంటే చార్జ్ షీట్ వేస్తామని, ఆరు నెలల వరకూ జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు. ప్రతి వాహనానికీ ఇన్స్యూరెన్స్ తప్పకుండా ఉండాలని, అది లేకున్నా ఇబ్బంది తప్పదని అంటున్నారు. తమ వాహనాలకు ఉన్న చలాన్లను 'ఈచలాన్' వెబ్ సైట్ లో చూసుకోవచ్చని, మీసేవ, ఈసేవ, ఏపీ-ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, పోస్టాఫీస్, ట్రాఫిక్ పోలీస్ యాప్ తదితర మాధ్యమాల్లో చెల్లించవచ్చని సూచించారు. జేబులు గుల్ల కాకుండా ఉండాలంటే, అన్ని ట్రాఫిక్ నియమాలనూ తు.చ తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.