Crime News: స్నేహితుడని నమ్మితే మృగంలా వ్యవహరించాడు: ఆశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిలింగ్
- బీబీఏ విద్యార్థి వేధింపుల తీరు ఇది
- నగ్న చిత్రాలు పంపించాలని ఒత్తిడి
- బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
సహచర విద్యార్థినిని చంపుతానని బెదిరించి స్నేహానికి ఒప్పించిన ఓ ప్రబుద్ధుడు ఆమె కాస్త చేరువయ్యేసరికి తనలోని మృగత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఆమెతో కలిసి తీసుకున్న సెల్ఫీలను ఆసరాగా చేసుకుని ఆశ్లీల చిత్రాలు పంపాలంటూ భయపెట్టాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె అది కూడా చేసినా ఆ తర్వాత మరో అడుగు ముందుకు వేయాలని చూశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్ రయనుద్దీన్(19) శంకర్‌పల్లిలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. కళాశాల వసతిగృహంలోనే ఉంటున్నాడు.
సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహం కోసం ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించడంతో పదేపదే ఆమె వెంటపడి ఒత్తిడి తెచ్చాడు. స్నేహం చేయకుంటే చంపేస్తానని బెదిరించాడు. తప్పని పరిస్థితుల్లో బాధితురాలు అంగీకరించడంతో ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకునే వాడు. కొన్ని రోజుల తర్వాత అవే సెల్ఫీలను బాధిత యువతిని బ్లాక్ మెయిల్ చేయడానికి వాడడం మొదలుపెట్టాడు.
తాను చెప్పినట్లు చేయాలని, అందుకు అంగీకరించకపోతే సెల్ఫీ చిత్రాలను మీ అమ్మానాన్నలకు పంపిస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు కొన్నాళ్లుగా మౌనంగా రోదిస్తోంది. ఆమె అసహాయతను గుర్తించిన నిందితుడు మరింత రెచ్చిపోయాడు. ఓరోజు ఆ యువతి కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు ఫోన్ చేసిన రయనుద్దీన్ 'వాష్‌రూంలోకి వెళ్లి నీ నగ్నచిత్రాలు సెల్ఫీ తీసుకుని నాకు పంపు' అంటూ ఒత్తిడి చేశాడు.
దీనికి తలొగ్గిన బాధితురాలు అతను చెప్పినట్టు చేసింది. ఆ చిత్రాలు చేతికి చిక్కేసరికి నిందితుడిలోని మృగాడు మరింత రెచ్చిపోయాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు రయనుద్దీన్ అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.