Andhra Pradesh: కమలదళంలో ఉన్న పచ్చ పుష్పం సీఎం రమేశ్ జగన్ ను విమర్శిస్తున్నాడు!: అంబటి రాంబాబు

  • అమెరికాలో ఉన్నవి విద్యుత్ జ్యోతులే
  • వాటిని అగ్గిపెట్టె, వొత్తులతో వెలిగించలేం
  • 40 ఆలయాలను కూల్చినప్పుడు హిందూ సంస్కృతి ఏమైంది?

అమెరికా పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంపై బీజేపీ చేస్తున్న విమర్శలను వైసీపీ నేత అంబటి రాంబాబు తిప్పికొట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. అమెరికాలోని ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వొత్తులు, అగ్గిపుల్లల ద్వారా జ్యోతి ప్రజ్వలన చేయడం కుదరదని అంబటి తెలిపారు. ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారానే అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయగలమని స్పష్టం చేశారు.

అందుకే జగన్ జ్యోతిని మర్యాదపూర్వకంగా తాకి వెనక్కి వెళ్లి కూర్చున్నారని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ‘జగన్ హిందూ వ్యతిరేకి. అమెరికాలో జ్యోతి వెలిగించలేదు’ అని దుమారం లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలదళంలో, కమల వనంలో ఉన్న పచ్చ పుష్పం సీఎం రమేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని సెటైర్ వేశారు. సీఎం రమేశ్ నిజంగా బీజేపీలోకి వెళ్లారో, లేదా చంద్రబాబు తన కోవర్టుగా పంపించారో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.

తమను విమర్శిస్తున్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చివేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు హిందూ సంస్కృతి ఏమయిందని ప్రశ్నించారు. సదావర్తి భూములను చంద్రబాబు, ఆయన తాబేదార్లు గుటుక్కున్న మింగేస్తుంటే పైడికొండల తన పదవి కోసం మౌనంగా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్ హిందూ వ్యతిరేకి అని ముద్రవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
BJP
CM Ramesh
YSRCP
Jagan
Chief Minister
AMBATI RAMBABU
  • Loading...

More Telugu News