Shehla Rashid: కశ్మీర్ లో మానవహక్కుల హననం జరుగుతోందనడానికి ఆధారాలున్నాయి: షెహ్లా రషీద్
- తన వద్ద ఉన్న ఆధారాలను ఆర్మీకి ఇస్తానని వెల్లడి
- భారత సైన్యం నిష్పాక్షిక విచారణ జరపాలంటూ డిమాండ్
- నా ఆరోపణలు తప్పు అని నిరూపించడానికి ఆర్మీ వద్ద ఉన్న ఆధారాలేంటి? అంటూ వ్యాఖ్యలు
కశ్మీర్ లో మానవ హక్కులు మంట గలిసిపోతున్నాయంటూ ఉద్యమ నేత, జేఎన్యూ విద్యార్థి షెహ్లా రషీద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై ఆమె మరోసారి స్పందించారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, భారత సైన్యం నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు ముందుకు వస్తే, అన్ని వివరాలతో కూడిన ఆధారాలను వారికి సమర్పిస్తానని షెహ్లా రషీద్ స్పష్టం చేశారు. నేను ఆధారాలను సమర్పిస్తే ఏంజరుగుతుందన్నది అప్రస్తుతం, కానీ అల్ప జీవులైన కశ్మీరీలు చెబుతున్నది నిరాధారమని పేర్కొంటుండడంపైనే నా ఆవేదనంతా అని వ్యాఖ్యానించారు. "నా ఆరోపణలు తప్పు అని నిరూపించడానికి ఆర్మీ వద్ద ఏం ఆధారాలున్నాయి?" అని ప్రశ్నించారు. తాను సమర్పించే ఆధారాలన్నీ నిజమే అని నిరూపితమైతే బాధ్యులను ఆర్మీ శిక్షిస్తుందా? అని నిలదీశారు.