Ntr: ఎన్టీఆర్ గారు అలా అనడంతో ఉలిక్కిపడ్డాను: రావి కొండలరావు
- ఎన్టీ రామారావుగారు ఎయిర్ పోర్టులో కలిశారు
- ఆయన మాటను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు
- నాకు నోట మాట రాలేదన్న రావి కొండల రావు
'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటుడు .. రచయిత రావికొండలరావు మాట్లాడుతూ, ఒకసారి తనకి .. ఎన్టీ రామారావుకి మధ్య జరిగిన సంభాషణను గురించి ప్రస్తావించారు. "ఒక వైపున 'దానవీరశూరకర్ణ' .. మరో వైపున 'కురుక్షేత్రం' షూటింగులు జరుగుతున్న రోజులవి. నేను చెన్నై నుంచి హైదరాబాద్ కి బయల్దేరాను. ఆ సమయంలో నాతో పాటు కాంతారావుగారు .. ప్రభాకర్ రెడ్డి గారు .. గిరిబాబు వున్నారు.
ఎయిర్ పోర్టులో ఎన్టీ రామారావుగారు కలిశారు. ఆయన మమ్మల్ని పిలిచి తనతో పాటు ఒక చోట కూర్చోబెట్టుకున్నారు. 'దుర్యోధనుడికి ఎవరైనా డ్యూయెట్ పెడతారా బ్రదర్' అన్నారు ఆయన నాతో. 'కురుక్షేత్రం' సినిమాలో పెట్టారేమోననుకుని, 'దుర్యోధనుడికి డ్యూయెట్ ఏంటండీ .. చెత్త ఐడియా' అన్నాను నేను. ఆయన నవ్వుతూ 'మనం పెట్టాం బ్రదర్' అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. అదే 'చిత్రం భళారే విచిత్రం' సాంగ్. ఆయనతో 'చెత్త ఐడియా' అనేశానే అని నేను భయపడిపోయాను. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేంతవరకూ నాకు నోట మాట రాలేదు" అని చెప్పుకొచ్చారు.