Andhra Pradesh: నా ఇల్లు ముంచటానికే ప్రజల ఇళ్లు ముంచారు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
- కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాబు
- కరకట్ట వెంట ప్రజలకు పలకరింపు
- సమస్యలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గీతానగర్, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. కరకట్ట వెంట ప్రజలను పలకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, కరకట్ట వెంబడి రక్షణగోడను ప్రభుత్వం పూర్తి చేసి తీరాలని, ఇది పూర్తి చేయాలన్నది అందరి డిమాండ్ అని అన్నారు. అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇక్కడి నుంచి ప్రజలను తరలిస్తామని మంత్రులు అనడం తగదని అన్నారు. వరదసహాయ చర్యలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని విమర్శించారు. వరదనీటి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ‘నా ఇల్లు ముంచడానికే ప్రజల ఇళ్లు ముంచారు’ అని విమర్శించారు.