India: భారత్ లోకి పాక్ ముష్కరులు.. ఏ క్షణమైనా దాడులకు పాల్పడే ఛాన్స్.. ఐబీ హెచ్చరిక!
- ఐఎస్ఐ ఏజెంట్ సహా నలుగురు ముష్కరుల రాక
- గుజరాత్, రాజస్థాన్ పోలీసులకు ఐబీ సమాచారం
- దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం
జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై రగిలిపోతున్న పాకిస్థాన్ దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఏజెంట్ తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.
ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐబీ తెలిపింది. అన్ని రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
కాగా, పాక్ ఐఎస్ఐ ఏజెంట్, ముగ్గురు ఉగ్రవాదులు అఫ్గానిస్థాన్ పాస్ పోర్టులతో భారత్ లోకి ప్రవేశించారని ఐబీ చెప్పింది. ఈ నెల ప్రారంభంలోనే భారత్ లోకి చొరబడ్డ ఈ ముష్కరులు.. ఏ క్షణమైనా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఈ దుండగుల ఫొటోలను ఐబీ అన్ని రాష్ట్రాలకు పంపించింది.