Hyderabad: హైదరాబాద్ లో 'డ్రంకెన్ డ్రైవ్' సినిమా షూటింగ్... ఎటువాళ్లు అటు పరార్!
- షేక్ పేట నాలా వద్ద సినిమా షూటింగ్
- నిజమైన పోలీసులనుకుని భయపడ్డ మందుబాబులు
- ప్రత్యామ్నాయ మార్గాల్లో పలాయనం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వారాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మందుకొట్టి వాహనాలను నడిపేవారిని గుర్తించి, వారికి జరిమానాలు, జైలుశిక్షలు విధించేలా చూడటమే వీరి పని. అయితే, నిన్న మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
వాస్తవానికి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పబ్ లు అధికంగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో అధికం. ఈ రూట్ లో వారాంతంలో మందు కొట్టి వాహనం నడపాలంటే వాహనదారులకు హడలే. ఎక్కడ పోలీసులు మకాం వేస్తారోనన్న విషయం తెలియదు కాబట్టి.
అయితే నిన్న రాత్రి ఫిల్మ్ నగర్, షేక్ పేట నాలా సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని వాహనదారులకు తెలిసింది. దీంతో మందుబాబులు, ఎప్పుడూ లేంది, ఈ మార్గంలో తనిఖీలు ఏంట్రా బాబూ? అనుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల్లో పరారయ్యారు.
వాస్తవానికి ఓ సినిమా షూటింగ్ అక్కడ జరిగింది. రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు, పోలీసు వ్యాన్ లు, జూనియర్ ఆర్టిస్టులు, మందుబాబులతో సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, వారిని చూసి రియల్ పోలీసులని భావించిన మందుబాబులు పలాయనం చిత్తగించారు. ఇక సినిమా షూటింగ్ కు వచ్చిన జనం, వారు నిలిపిన వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.