Rajani: నేను నటుడిని కావడానికి కారణం రజనీకాంత్ గారే: సాయికిరణ్
- రజనీకాంత్ గారిని దగ్గరగా చూశాను
- నన్ను చూడగానే రజనీ అలా అన్నారు
- నాన్న చెప్పినట్టుగానే చేశానన్న సాయికిరణ్
ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ తనయుడిగా, బుల్లితెర .. వెండితెర నటుడిగా సాయికిరణ్ కి మంచి గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నటుడు కావాలనే ఆలోచన తనకి ఎలా కలిగిందనే విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా నాయనమ్మ సుశీలగారి వాళ్లబ్బాయి జయకృష్ణ పెళ్లికి రజనీకాంత్ గారికి శుభలేఖ ఇవ్వడానికి నాన్న వెళుతుంటే నేను కూడా వెంట వెళ్లాను.
విజయ స్టూడియోలో రజనీకాంత్ గారు ఒక సినిమా షూటింగులో వున్నారు. ఆయనని దగ్గరగా చూడగానే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. శుభలేఖ తీసుకున్న రజనీకాంత్ గారు నన్ను చూస్తూ, 'రామకృష్ణ గారూ .. మీ అబ్బాయి ఆర్టిస్టా?" అని అడిగారు. 'లేదండీ చదువుకుంటున్నాడు' అన్నాడు నాన్న. 'ఆర్టిస్టు అనుకున్నాను .. ఎక్కడో చూసినట్టు అనిపించింది' అని రజనీ అన్నారు. అప్పటి నుంచి నా ఆలోచనలు నటన వైపుకు వెళ్లాయి. 'నాది ఆర్టిస్ట్ ఫేస్ అని రజనీకాంత్ గారే' అన్నారు. నేను యాక్ట్ చేస్తాను అని పట్టుబట్టాను. చదువు పూర్తి చేశాక యాక్టింగ్ వైపు వెళ్లమని నాన్న అనడంతో అలాగే చేశాను" అని చెప్పుకొచ్చాడు.