articla 370: పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్రానికి సమయం ఇవ్వండి : సుప్రీంకోర్టు
- కశ్మీర్‌లో మీడియా, సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం
- పిటిషన్ దాఖలు చేసిన కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
- సూచించిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే
కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక కశ్మీర్‌లో మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ద కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా బేసిన్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం ఈరోజు విచారించింది. దీనిపై జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే మాట్లాడుతూ 'ఈరోజు ఉదయం కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడాం. ల్యాండ్‌లైన్ వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు' అని ప్రస్తావించారు.
దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని, జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు. ఈ అంశంలో కేంద్రానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన ధర్మాసనం మరోసారి దీనిపై విచారిద్దామని వాయిదా వేసింది. తేదీ మాత్రం ఖరారు చేయలేదు.