Vijayawada: చంద్రబాబు ఇంటి మెట్లను తాకిన కృష్ణమ్మ వరద... ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు నిషేధం!
- గంటగంటకూ పెరుగుతున్న వరద
- మరో అడుగున్నర పెరిగితే లింగమనేని గెస్ట్ హౌస్ లోకి నీరు
- అధికారులతో చర్చించిన గుంటూరు కలెక్టర్
విజయవాడ వద్ద కృష్ణానదిలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండటంతో ఉండవల్లిలో చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నివాసం మెట్ల వరకూ వరద నీరు చేరింది. వరద ఉద్ధృతి ఇదే విధంగా కొనసాగితే, చంద్రబాబు ఇంట్లోకి సైతం నీరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన గుంటూరు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం వరద 15 అడుగుల ఎత్తు వరకూ ఉండగా, 16.5 అడుగులకు నీరు పెరిగితే, ఇంట్లోకి నీరు వస్తుందని అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు నదిలో ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ పై ద్విచక్రవాహనాలు మినహా మిగతా వాహనాల ప్రయాణాలను అధికారులు నిషేధించారు.
కాగా, విజయవాడ పరిధిలోని బాలాజీనగర్, భూపేష్ గుప్తా నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చేరింది. యనమలకుదురు వద్ద ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరకట్టకు దగ్గరలో ఉన్న అరటి తోటలను వరద ముంచెత్తింది.