Hyderabad: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త... ఇకపై మూడు నిమిషాలకో మెట్రో!
- హైటెక్ సిటీ మార్గంలో అందుబాటులోకి వచ్చిన రివర్సల్ సదుపాయం
- పీక్ అవర్స్ లో మూడు నిమిషాలకో మెట్రో రైల్
- వెల్లడించిన హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లోని వందలాది ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మందికి మెట్రో రైల్ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై హైటెక్ సిటీ, నాగోల్ మార్గంలో పీక్ టైమ్ లో ప్రతి మూడు నిమిషాలకో రైలును తిప్పుతామని, నాన్ పీక్ అవర్స్ లో ఐదు నిమిషాలకో మెట్రో ఉంటుందని తెలిపారు.
ఇటీవలి కాలం వరకూ హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు కాస్తంత ఆలస్యంగా నడిచాయని, ఇప్పుడా సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో సగటున 5 నుంచి 6 వేల మంది వరకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, గత బుధవారం ఏకంగా 3.06 లక్షల మంది ప్రయాణించారని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
హైటెక్ సిటీ నుంచి - రాయదుర్గం జంక్షన్ వరకూ మెట్రో పట్టాల నిర్మాణం, సిగ్నలింగ్ తదితర పనులు పూర్తయ్యాయని, ఈ మార్గంలో ట్రయల్ రన్ నెలాఖరు నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. ఇక పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గంలోని 10 కిలోమీటర్ల దూరం మెట్రో రైల్, డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.