Iltija javed: మమ్మల్ని పశువుల్లా బంధించారు: అమిత్ షాకు మెహబూబా ముఫ్తీ కుమార్తె లేఖ
- దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాల్లో మునిగిపోయింది
- కశ్మీర్ ప్రజలను మాత్రం పశువుల్లా బంధించారు
- నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నా
కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పలువురు రాజకీయ నేతలు, వేర్పాటు వాదులను నిర్బంధించిన సంగతి తెలిసిందే. పోలీసు నిర్బంధంలో ఉన్న వారిలో మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావెద్ ఓ వాయిస్ మెసేజ్ ను విడుదల చేశారు. మరోసారి తాను మీడియాతో మాట్లాడితే... తాను కూడా చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండవచ్చని అన్నారు. ఈ నిర్బంధాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానని చెప్పారు.
దేశ ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవాల్లో మునిగిపోయి ఉంటే... కశ్మీర్ ప్రజలను మాత్రం పశువుల్లా బంధించారని ఇల్తిజా మండిపడ్డారు. కనీస మానవ హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నారని అన్నారు. తనను కూడా నిర్బంధించే అవకాశం ఉందని... తనను ఓ క్రిమినల్ లా చూస్తున్నారని... తనపై నిరంతర నిఘా ఉందని చెప్పారు. తమ గొంతుకను వినిపిస్తున్న ఇతర కశ్మీరీల మాదిరే తన జీవితం కూడా ఏమైపోతుందో అనే భయం తనలో ఉందని అన్నారు.