Hong Kong: 10 నిమిషాలు చాలు, హాంకాంగ్ పై వాలిపోతాం... చైనా దూకుడు!
- హాంకాంగ్ లో కొన్ని వారాలుగా నిరసనలు
- తమపై చైనా పెత్తనం ఏంటంటూ హాంకాంగ్ వాసుల ఆగ్రహం
- సైనిక చర్యకు చైనా ఏర్పాట్లు?
హాంకాంగ్ పై మరిన్ని అధికారాల కోసం పట్టుదలగా వ్యవహరిస్తున్న చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. గత కొన్నివారాలుగా హాంకాంగ్ ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి చైనాను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. హాంకాంగ్ లో నేరాలకు పాల్పడిన వాళ్లను చైనా ప్రధాన భూభాగంపై విచారించేలా కొత్త చట్టాల రూపకల్పనకు చైనా ప్రయత్నిస్తుండడాన్ని హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. వీధుల్లోకి వచ్చిన వేలాది జనం చైనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా తన సేనలను హాంకాంగ్ సరిహద్దు ప్రాంతానికి తరలిస్తోంది.
ముఖ్యంగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ దూకుడు ప్రదర్శిస్తోంది. తమకు 10 నిమిషాల సమయం చాలని, హాంకాంగ్ పై దండులా వాలిపోతామని హెచ్చరిస్తోంది. చైనా-హాంకాంగ్ సరిహద్దులోని షెంఝెన్ నగరంలో సైనిక కదలికలు ఊపందుకోవడం అటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. షెంఝెన్ కేంద్రంగా చైనా ఈస్ట్రన్ కమాండ్ భారీగా సైనికులను, సాయుధ వాహనాలను సిద్ధంగా ఉంచడం చైనా దూకుడును స్పష్టం చేస్తోంది.