Kala Venkata Rao: స్వాతంత్ర్యం వచ్చిన రోజు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్యం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు: కళా వెంకట్రావు
- చీరాలలో కరణం బలరాంను అడ్డుకోవడంపై ఖండన
- స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ విమర్శలు
- ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలావుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన కళా
చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ కార్యకర్తల మధ్య స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. చీరాలలో కరణం బలరాంను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య దిన వేడుకలకు వస్తున్న స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని విమర్శించారు.
గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని, ఇప్పుడు స్వాతంత్ర్య దిన సంబరాలకు హాజరవ్వడాన్ని కూడా అడ్డుకుంటారా? అంటూ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన రోజు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్యం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలావుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
త్రివర్ణ పతాకావిష్కరణ కోసం చీరాల ఎమ్మెల్యే హోదాలో కరణం బలరాం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడ వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు, ఇతర కార్యకర్తలు మోహరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది.