Andhra Pradesh: స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అంటే కొందరు నానాయాగీ చేస్తున్నారు!: ఏపీ సీఎం వైఎస్ జగన్
- నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
- గ్రామాల్లో మద్యపాన నిషేధం కోసం బెల్టు షాపులను ఎత్తివేశాం
- విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం
1857లో మంగళ్ పాండే బ్రిటీష్ పాలకులపై తిరగబడి సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. ఆ తరువాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలనీ, మన ప్రభుత్వాలను మనమే ఎన్నుకోవాలనీ, మన తలరాతలను మనమే మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
- మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండటానికి వీల్లేదు. విభజించి పాలించే ఆలోచనలు పోవాలి
- సంఘ సంస్కరణలు రావాలి. కుల,మత, వర్గ విభేదాలు చెరిగిపోవాలి. మానవత్వం నిలిచిపోవాలి
- ఈ ఆదర్శాలతోనే మన జాతీయ పోరాటం సాగింది.
- వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు.. వందలకొద్దీ సంస్థానాలున్న భారత్ స్వాతంత్ర్య పోరాటం కారణంగానే ఒక్కటయింది.
- వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, జైహింద్, క్విట్ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగిలించాయి
- ఒక జాతి, ఒక దేశంగానీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతే ఎన్ని వందల ఏళ్లు బానిసలుగా, రెండో తరగతి పౌరులుగా, మానవహక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో, ఎన్ని పోరాటాలు, ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర్య ఉద్యమం చెబుతోంది.
- ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తొలి సర్కారు మనదే.
- పరిశ్రమలు, ఇతర ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ తెస్తూ మనమే చట్టం చేశాం
- మద్య నియంత్రణ కోసం బెల్టు షాపులు మూయించాం.
- వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రాష్ట్రంలో 15-16 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
- కార్పొరేట్ చదువుల సంస్కృతిని మార్చే విధంగా చట్టాలు చేయబోతున్నాం.
- వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్నాం.
- గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తాం
- ఈ ఏడాది బ్యాంకుల నుంచి రైతులకు రూ.84,000 పంట రుణాలను అందజేయబోతున్నాం
- మెట్ట ప్రాంత రైతుల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 రిగ్గులు కొనుగోలు చేసి ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. ఇందుకోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేయబోతున్నాం.
- ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ.1.50కే అందిస్తూ, రైతులకు రూ.720 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నాం.
- స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామంటే కొందరు నానాయాగీ చేస్తున్నారు.
- కరెంట్ చార్జీలు తగ్గించండి అని కంపెనీలను అడిగితే హాహాకారాలు చేస్తున్నారు.
- గతంలో కమీషన్ల కోసం అడ్డగోలుగా కోట్ చేసిన టెండర్ల ధరలను తగ్గించండి అని కోరితే గగ్గోలు పెడుతున్నారు.
- ఈ వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతో వచ్చాం కాబట్టే గత రెండున్నర నెలల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.
- శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే.