Narendra Modi: దేశ జనాభా పెరుగుతుండటంపై నరేంద్ర మోదీ ఆందోళన!
- చిన్న కుటుంబం ఉంటేనే దేశాభివృద్ధి
- ఇంకా మంచినీరు లభించని కుటుంబాలెన్నో
- దేశ సమగ్రత, జాతి భవిష్యత్తే ముఖ్యం
- ఎర్రకోటపై నరేంద్ర మోదీ
దేశ జనాభా ఏటికేడూ కోట్ల సంఖ్యలో పెరుగుతూ ఉండటం తనకు ఆందోళన కలిగిస్తోందని, ఇది దేశాభివృద్ధికి విఘాతం కాగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, చిన్న కుటుంబాన్ని కలిగివున్న వారంతా దేశాభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న వారేనని అన్నారు. దేశంపై భక్తిని చూపించాలంటే చిన్న కుటుంబాన్ని మాత్రమే కలిగివుండాలని సూచించారు. జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించిన మోదీ, తదుపరి తరాలు ఏ సమస్యా రాకుండా ఉండాలంటే, ఇప్పుడే జాగ్రత్త పడాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా, ఇంకా ఇండియాలో నిత్యమూ మంచినీరు లభించని కుటుంబాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయని, ఈ సమస్య మరింతగా పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.
దేశ సమగ్రత, జాతి భవిష్యత్తే తనకు ముఖ్యమని, అందుకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించిన మోదీ, 'ఒకే దేశం - ఒకే రాజ్యాంగం' కల సాకారమైందని అన్నారు. త్వరలోనే 'వన్ నేషన్ - వన్ పోల్'ను కూడా సాకారం చేస్తామని, అయితే, ఈ విషయంలో దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సి వుందని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి అభివృద్ధిని గురించి పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. దేశంలోని ఎంతో మంది పేదలకు ఇప్పటికీ విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల వసతి లేవని, సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యంగా సాగుతానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ తాగు నీటిని అందించేందుకు రూ. 3.50 లక్షల కోట్లతో జల జీవన్ మిషన్ ను ప్రారంభిస్తామని చెప్పారు.