New Delhi: మొదలైన పంద్రాగస్టు వేడుకలు... ఢిల్లీలో భారీ భద్రత!
- ప్రారంభమైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- అమర వీరులకు మోదీ నివాళి
- దేశవ్యాప్తంగా వేడుకలు
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశ రాజధానిలో ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తొలుత అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఎర్రకోట వద్దకు రాగా, ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆరోసారి ఎర్రకోట వేదికగా మోదీ ప్రసంగించనున్నారు. దీంతో ఆయన వాజ్ పేయి రికార్డును సమం చేయనున్నారు.
ఇదిలావుండగా, వేడుకలు ప్రారంభం కావడానికి కాసేపటి ముందు భారీ వర్షం పడింది. న్యూఢిల్లీలోని రాజ్ కోట పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినా ఆగస్టు 15 వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ ఉదయం రాజ్ ఘాట్ ను సైతం సందర్శించిన నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భారీ భద్రతా చర్యలను చేపట్టారు. ఎర్రకోటను నో ఫ్లయ్ జోన్ గా ప్రకటించిన అధికారులు, ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాజ్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.