Andhra Pradesh: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఏది చూసినా కుంభకోణమే!: సీఎం జగన్ ఆరోపణలు
- టెండర్ల ప్రక్రియ నుంచి తెచ్చిన అప్పుల వరకూ అన్నీ కుంభకోణాలే
- అవినీతికి పాల్పడే వారిని వదిలేయాలా?
- అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందల, వేల కోట్ల రూపాయల కుంభకోణాలే కనిపిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. మంత్రి వర్గ ఉపసంఘంతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజాధనానికి మనం కాపలదారులుగా ఉండాలా? లేక అవినీతికి పాల్పడే వారిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయొద్దని చెప్పారు. ఈ విషయంలో తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి సహకరించాలని, ఒత్తిళ్లను పట్టించుకోవద్దని సూచించారు.